IYR Krishna Rao: వైసీపీ నుంచి ఒకరు ఫోన్ చేసి ఐటీ దాడులపై ట్వీట్ చేయరా సార్? అని అడిగారు: ఐవైఆర్ కృష్ణారావు

  • నా ట్వీట్లు వైసీపీ, టీడీపీ అంచనాలకు అతీతంగా ఉంటాయని ఆయనకు చెప్పా
  • బీజేపీని దూషించిన వ్యక్తులే ఇప్పుడు ఆ పార్టీ ప్రతినిధులుగా టీవీ షోలలో వస్తున్నారు
  • ప్రతినిధులు లేక బీజేపీ గొడ్డుపోయిందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది
Some of from YSRCP called me and asked to tweet on IT raids says IYR Krishna Rao

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన ఐటీ దాడులు సంచలనం రేకెత్తించాయి. రెండు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించామని ఐటీ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వివరణ ఇవ్వలేని రూ. 85 లక్షల నగదును, రూ. 71 లక్షల విలువైన నగలను సీజ్ చేశామని తెలిపింది.

మరోవైపు, ఈ దాడులపై వైసీపీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్ గా, చదవడం వచ్చిన వారి వద్ద ఐటీ ప్రెస్ నోట్ ను చదివించుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైసీపీ నుంచి తనకు ఒకరు ఫోన్ చేశారని... ఐటీ దాడులపై మీరు ట్వీట్ చేయరా సార్? అని అడిగారని ఆయన చెప్పారు. తన ట్వీట్లు వైసీపీ, టీడీపీ అంచనాలకు అతీతంగా ఉంటాయని ఆయనకు తాను సమాధానమిచ్చానని తెలిపారు.

ఇదే సమయంలో బీజేపీపై కూడా ఐవైఆర్ విమర్శలు గుప్పించారు. 'హాస్యాస్పదమైన విషయం. తెలుగుదేశంలో ఉంటూ బీజేపీని, ప్రధాని మోదీని హద్దులు పద్దులు లేకుండా దూషించిన వ్యక్తులే ఈరోజు బీజేపీ ప్రతినిధులుగా టీవీ షోలలో వస్తున్నారు. పంపించటానికి పార్టీ ప్రతినిధులు లేక బీజేపీ గొడ్డు పోయిందా? అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది' అని వ్యాఖ్యానించారు.

More Telugu News