జనరల్ కంపార్టుమెంట్ లో భార్యకు సీట్ అడిగినందుకు కొట్టి చంపేశారు!

14-02-2020 Fri 11:27
  • మహారాష్ట్రలో దారుణ ఘటన
  • రెండేళ్ల పాప, భార్యతో కలిసి రైలెక్కిన సాగర్
  • సీటు అడిగినందుకు గంట పాటు కొట్టిన 10 మంది
Train Passenger Beaten To Death

రెండు సంవత్సరాల పాపతో ఉన్న తన భార్య కూర్చునేందుకు సీటిచ్చి సర్దుకోవాలని కోరిన పాపానికి, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముంబై నుంచి లాతూరు మీదుగా బీదర్ కు ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, గురువారం నాడు కల్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మార్కండ్, తన భార్య జ్యోతి, రెండేళ్ల కుమార్తెతో కలిసి తమ బంధువు అంత్యక్రియల నిమిత్తం వెళ్లేందుకు రైలెక్కాడు.

అప్పటికే జనరల్ కంపార్టుమెంట్ మొత్తం జనంతో నిండిపోయింది. ఓ చోట కొంతమంది ఆడవాళ్లు కూర్చుని ఉండగా, తన భార్యకు కొంచెం స్థలం ఇవ్వాలని అతను అడిగిన వేళ, గొడవ మొదలైంది. ఆ మహిళలతో పాటు రైలెక్కిన ఇతర పురుషులు, సాగర్ ను దారుణంగా కొట్టారు. తన భర్తను కొట్టవద్దని జ్యోతి మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదు. దాదాపు గంట పాటు వారి పైశాచికం సాగింది.

పూణె దాటాక దౌండ్ స్టేషన్ కు రైలు వచ్చిన తరువాత, రైల్వే పోలీసులు సాగర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, ఫలితం దక్కలేదు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆరుగురు మహిళలను, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.