Disha: 'దిశ' కావాలంటున్న ఏపీ యువతులు... 4.9 స్టార్ రేటింగ్ తో ఫుల్ డౌన్ లోడ్స్!

  • నాలుగు రోజుల క్రితం విడుదలైన యాప్
  • 50 వేలకు పైగా డౌన్ లోడ్లు
  • యాప్ ను పరీక్షిస్తున్న యువతులు
Disha app gets high rating

ఏదైనా ఆపదలో ఉన్న యువతులు, తక్షణ సహాయం కోరుకుంటే అందించే 'దిశ' యాప్ కు ఇప్పుడు ఏపీలో తెగ డిమాండ్ ఉంది. ఈ యాప్ ను నాలుగు రోజుల క్రితం విడుదల చేయగా, ఇప్పటికే 50 వేలకు డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. ఓ రీజనల్ యాప్ కు ఇంత స్పందన రావడం ఎంతో గర్వకారణమని 'దిశ' స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ అన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో దీనికి దాదాపు 5 స్టార్ రేటింగ్ ఉందని, 4.9 రేటింట్ వచ్చిందని ఆమె అన్నారు.

కాగా, ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు సగటున రోజుకు 2 వేలకు పైగా టెస్ట్ కాల్స్ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరీక్షిస్తున్నారని, తాము వెంటనే ప్రతిస్పందిస్తున్నామని అన్నారు. ఆపై వారికి ఇకపై ఇలా చేయవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్నామని అన్నారు.

ఇక, ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత, ఓ భర్త వేధింపుల నుంచి భార్యను కాపాడామని, పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసకు సోదరుడయ్యే వ్యక్తి వేధిస్తుంటే, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఓ బాలిక ఫిర్యాదునూ పరిష్కరించామని ఆమె తెలిపారు.

More Telugu News