మోదీజీ! మీకో గిఫ్ట్.. వచ్చి తీసుకెళ్లండి: ప్రధానికి షహీన్‌బాగ్ నిరసనకారుల నుంచి ఆహ్వానం

14-02-2020 Fri 09:07
  • వాలెంటైన్స్ డే వేడుకల్లో పాల్గొనండి
  • మీకోసం సిద్ధం చేసిన బహుమతిని తీసుకెళ్లండి
  • సీఏఏ వల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పండి
Shaheen bagh protesters welcomes Modi

నేడు నిర్వహించనున్న ప్రేమికుల రోజు వేడుకల్లో పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలోని షహీన్‌బాగ్ నిరసనకారులు ఆహ్వానించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ప్రేమగీతాన్ని ఆవిష్కరించనున్న నిరసనకారులు ఈ సందర్భంగా ప్రధాని కోసం ఓ గిఫ్ట్ కూడా సిద్ధం చేశారు. దీనిని తీసుకోవడానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను నిరసన వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ‘మోదీజీ షహీన్‌బాగ్ రండి.. మీ కోసం సిద్ధం చేసిన బహుమతిని తీసుకోండి.. మాతో మాట్లాడండి’ అని పోస్టర్లలో పేర్కొన్నారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాము ప్రవర్తించడం లేదని పేర్కొన్న నిరసనకారులు అమిత్ షా ఎవరైనా తమ వద్దకు వచ్చి మాట్లాడొచ్చన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై తమను ఒప్పించగలిగితే నిరసనలను ఆపేస్తామని ఈ సందర్భంగా నిరసనకారులు తెలిపారు. సీఏఏ వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనం గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నారు. నిరుద్యోగం, పేదరికం సహా దేశ ఆర్థిక మందగమనం వంటి  పలు సమస్యలకు సీఏఏతో పరిష్కారం ఎలా లభిస్తుందో చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.