Corona Virus: జపాన్ నౌకలో కరోనా కల్లోలం... తమను తీసుకెళ్లాలంటూ భారతీయుల ఆవేదన

  • హాంకాంగ్ లో దిగిన ప్రయాణికుడికి కరోనా ఆనవాళ్లు
  • యోకహామా రేవులో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ నౌక
  • నౌకలో 3700 మందికి పైగా ప్రయాణికులు
  • 130 మందికి పైగా ప్రయాణికులకు వైరస్ సోకినట్టు గుర్తింపు

చైనాలో మొదలైన కరోనా వైరస్ బీభత్సం ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. ఇటీవల డైమండ్ ప్రిన్సెస్ అనే జపాన్ నౌకలో ప్రయాణించి హాంకాంగ్ లో దిగిన యాత్రికుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో ఆ జపాన్ నౌకను యోకహామా రేవు వద్ద నిలిపివేశారు. గత కొన్నిరోజులుగా డైమండ్ ప్రిన్సెస్ నౌక ఆ రేవులోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ నౌకలో 3700 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారిలో 130 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. ఇదే నౌకలో సుమారు 160 మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఈ నౌకలో తమ పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు కరోనా పరీక్షలు కూడా చేయలేదని చెఫ్ గా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న ఇతర భారతీయులతో కలిసి వినయ్ కుమార్ ఓ వీడియో సందేశం వెలువరించారు. తమను తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నౌకలో ఉన్న భారతీయులను వేరు చేసి, వీలైనంత త్వరగా తరలించాలని కోరారు.

More Telugu News