Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం ఇస్తున్నాం: మహావీర్ ట్రస్ట్    

  • తొలి విడతగా రూ. 2 కోట్ల విరాళం
  • చెక్ తీసుకుని అయోధ్యకు వెళ్తున్నామన్న ట్రస్టు కార్యదర్శి
  • శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభంకానున్న ఆలయ నిర్మాణం

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలు రాబోతున్నాయి. తాజాగా, ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న మహావీర్ మందిర్ ట్రస్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రస్టు కార్యదర్శి కిశోర్ కునాల్ మాట్లాడుతూ, ఈ మొత్తాన్ని విడతల వారీగా అందజేస్తామని చెప్పారు. తొలి విడతగా రూ. 2 కోట్లు ఇస్తున్నామని.. దీనికి సంబంధించిన చెక్ తీసుకుని అయోధ్యకు వెళ్తున్నామని వెల్లడించారు. రూ. 2 కోట్లకు సంబంధించిన చెక్ ను మీడియాకు చూపించారు.

తమ ట్రస్ట్ వద్ద రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయస్వామిలతో కూడిన 30 నాణేలు ఉన్నాయని... వీటిని 1818లో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిందని కిశోర్ కునాల్ తెలిపారు. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం వీటిని దాచి ఉంచామని చెప్పారు. మరోవైపు ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రారంభంకానుంది.

More Telugu News