ఆ దుస్తులు ధరిస్తున్నాం.. ఆర్థిక మాంద్యం ఎక్కడుంది: బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్

10-02-2020 Mon 16:14
  • దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది
  • దేశంలో చాలామంది సూట్లు, ప్యాంట్లు ధరిస్తున్నారు
  • పరిస్థితి బాగా లేకుంటే..ధోవతీలు, కుర్తాలు ధరించేవారు
దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని అందరూ అనుకుంటున్నారని, కానీ, అది నిజం కాదని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటూ సరికొత్త సూచికను వెల్లడించారు. యూపీలో ఓ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక తిరోగమనం గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయని, నిజంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారివుంటే తామంతా కుర్తాలు, ధోవతీలు ధరించి ఈ సమావేశానికి వచ్చి ఉండేవారమన్నారు.

దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని ఎలా చెప్పగలరు? అంటూ ప్రశ్నిస్తూ, దేశంలో చాలామంది జాకెట్, సూట్లు ధరిస్తున్నారన్నారు. వాటితో పోలిస్తే తక్కువ ధరకు లభించే సంప్రదాయ ధోవతీలు, కుర్తాలు ఎందుకు ధరించడంలేదో చెప్పాలన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉందనడానికి చిహ్నమని తాను పక్కగా చెబుతున్నానన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మంచి సూట్లు, ప్యాంట్లు, పైజామాలు ధరించేవారం కాదని ఎంపీ చెప్పారు.