Chevireddy Bhaskar Reddy: ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్రం దర్యాప్తు చేస్తే 124 A సెక్షన్ కింద కేసు నమోదు చేసి తీరుతుంది: చెవిరెడ్డి

  • దేశ ద్రోహిగా ఆయన ప్రజల ముందు నిలబడతారు
  • ఏబీ గురించిన వాస్తవాలను మాకు తెలియజేయాలి
  • ఐఏఎస్, ఐపీఎస్ లకు విజ్ఞప్తి చేస్తున్నా

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహశక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీరియస్ గా స్పందించి సమగ్ర విచారణ జరిపితే ఆయనపై 124 A సెక్షన్ కింద కేసు నమోదు చేసి తీరుతుందని, దేశ ద్రోహిగా ఆయన ప్రజల ముందు నిలబడతారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, వెంకటేశ్వరరావుతో పాటు భాగస్వామి అయిన ఘట్టమనేని శ్రీనివాస్ పైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు. చిత్తూరు జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారిగా, ఏబీ వెంకటేశ్వరరావు శిష్యుడిగా పని చేసిన రామ్ కుమార్ కు రెండు వందల కోట్లు ఆస్తులు ఉన్న విషయం ఈ మధ్యనే బయటపడిందని అన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో ఐఏఎస్, ఐపీఎస్ లకు తెలుసని అన్నారు. వెంకటేశ్వరరావు గురించి తెలిసిన వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఐఏఎస్, ఐపీఎస్ లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఉందని, ఆయనకు లుక్ ఔట్ నోటీసు జారీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

More Telugu News