TATA Strive: లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'

  • వివిధ రంగాల్లో అత్యున్నత శిక్షణను ఇస్తున్న టాటా స్ట్రైవ్
  • శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ప్లేస్ మెంట్లలో పూర్తి సహకారం
  • 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారికి అండగా టాటా ట్రస్టు కృషి

దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీపడుతున్న భారత్ ను నిరుద్యోగ సమస్య ఇప్పటికీ పీడిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను తీసుకుంటున్నప్పటికీ నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. ఉన్నత విద్యలను అభ్యసించిన ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. చదువుకు తగ్గ అవకాశాలు లేకపోవడం దీనికి ఒక కారణమయితే... సరైన నైపుణ్యాలు లేకపోవడం కూడా మరో కారణం. ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులకు అసలు ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్ లో మూడింట రెండు వంతుల మంది 35 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఎన్నో ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు చేయూతను అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. వీటిలో టాటా గ్రూపు కూడా ఒకటి. 'టాటా స్ట్రైవ్' పేరుతో ఆ సంస్థ నిరుద్యోగుల పాలిట వరప్రదాయినిగా మారింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా సర్టిఫికెట్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ, వారికి ప్లేస్ మెంట్లను కూడా కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన టాటా స్ట్రైవ్ క్యాంపస్ లలో వేలాది మంది తమ కోర్సులను పూర్తి చేసుకుని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఈ సంస్థ గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. అందరికీ ఈ గొప్ప అవకాశం గురించి తెలియజేయడం కోసమే ap7am.com ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం గురించి తమ సొంత వ్యక్తులకే కాకుండా... తెలిసిన వారికి, నిరుద్యోగులకు వివరించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు సహకరిస్తారని ఆశిస్తున్నాం.
హైదరాబాద్ తో పాటు అలీగఢ్, నాసిక్, మొహాలీ, ముంబై, పూణేల్లో టాటాస్ట్రైవ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పలు చోట్ల ఎక్స్ టెన్షన్ సెంటర్లు, పార్ట్ నర్ సెంటర్లను నెలకొల్పారు. హైదరాబాదులోని కేపీహెచ్ బీ కాలనీలో ఉన్న సెంటర్ లో బీపీవో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవెలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్, ఫుడ్ అండ్ బివరేజర్ సర్వీస్ స్టీవార్డ్, హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఆటొమొబైల్ సేల్స్ కన్సల్టెంట్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అసోసియేట్, రీటెయిల్ సేల్స్ అసోసియేట్, మల్టీ క్యుజిన్ కుక్, బ్యూటీ అడ్వైజర్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 4 వారాల నుంచి 17 వారాల వరకు కొనసాగే ఈ కోర్సులను టాటా స్ట్రైవ్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత వీరందరికీ అత్యున్నత బ్రాండ్ కంపెనీల్లో ప్లేస్ మెంట్లు పొందేందుకు సహకరిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులందరూ దాదాపుగా ఉద్యోగాలు పొందారు. స్టార్ హోటళ్లు, టాప్ బ్రాండెడ్ కంపెనీల్లో పని చేస్తున్నారు.    
ఉచితంగా కార్పొరేట్ స్థాయి శిక్షణ:
టాటా స్ట్రైవ్ సెంటర్లన్నీ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. ఈ సెంటర్లో అడుగు పెట్టిన మరుక్షణమే విద్యార్థుల్లో ప్రొఫెషనలిజం నిండేలా పరిసరాలు ఉంటాయి. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చయ్యే కోర్సులను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. అత్యున్నత స్థాయి ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు యూనిఫాం కూడా ఫ్రీగా ఇస్తుండటం గమనార్హం. అయితే హాస్టల్ వసతిని మాత్రం ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు.
విద్యార్థులు కోర్సులు ఎంపిక చేసుకునే విధానం:
ఇక్కడకు వచ్చే విద్యార్థులకు తొలుత ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుంటారు. అల్గోరిథమ్ అప్రోచ్ అనే విధానం ద్వారా పిక్చర్ బేస్ట్ అసెస్ మెంట్ చేస్తారు. కంప్యూటర్ లో 60 నుంచి 65 ఫొటోలను గుర్తించే టెస్ట్ పెడతారు. విద్యార్థులు గుర్తించే ఫొటోల ద్వారా వారి ఆసక్తిని అంచనా వేసి, ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తారు. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే శిక్షణను ఇస్తే.. విద్యార్థులు మరింతగా రాణిస్తారనేదే ఈ టెస్ట్ లక్ష్యం.

ఏ కోర్సులో శిక్షణ పొందాలి అనే విషయాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత... విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో వివరిస్తారు. ఈ సెషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తారు. తద్వారా తమ పిల్లలు ఎలాంట శిక్షణను పొందబోతున్నారనే విషయం వారికి కూడా అర్థమవుతుంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఒక భరోసా ఏర్పడుతుంది.





తొలి 12 రోజులు విద్యార్థులకు కేవలం వారి లక్ష్యాలు, ఆలోచనల సంబంధించిన బోధన ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా క్లాసులు ఉంటాయి. 12 రోజులు పూర్తైన తర్వాత కోర్సులో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయాన్ని సదరు విద్యార్థి తీసుకోవచ్చు. కోర్సులో కొనసాగాలనుకునే విద్యార్థికి 13వ రోజు నుంచి అసలైన శిక్షణ ప్రారంభమవుతుంది. క్లాసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. శిక్షణలో భాగంగా అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులతో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ పద్ధతిలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్లకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు టాప్ లెవెల్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా టాటా స్ట్రైవ్ సహకారం అందిస్తుంది.

ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన చిరునామా:
టాటా స్ట్రైవ్,
ఎన్ఎస్ఎల్ సెంట్రమ్ మాల్,
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన,
కేపీహెచ్ బీ ఫేజ్-3,
హైదరాబాద్.
ఫోన్: 040 67190400
సెల్: 8919302506




పూర్తి వివరాల కోసం: tatastrive.com
బ్రోచర్ కోసం: https://www.tatastrive.com/pdf/Tata%20STRIVE%20-%20Transformula%20Brochure.pdf

More Telugu News