Bill Gates: బిల్ గేట్స్ విహార నౌక ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు!

  • రూ.4,600 కోట్లతో అత్యంత విలాసవంతమైన నౌక కొనుగోలు
  • తన నౌకకు ఆక్వా అని నామకరణం చేసిన బిల్ గేట్స్
  • ఒక్కసారి ఇంధనం నింపితే 3,750 మైళ్లు ప్రయాణం చేయగలిగే సామర్థ్యం

ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పోయినేడాది మొనాకోలో నిర్వహించిన ఓ యాచ్ట్ ఎక్స్ పో ను సందర్శించాడు. అక్కడ ఎంతో విలాసవంతంగా, చూపరులకు అచ్చెరువొందించేలా కనిపించిన అందమైన విహారనౌకను చూడగానే గేట్స్ మనసు పారేసుకున్నారు. దాంతో ఆయన రూ.4600 కోట్లు పోసి మరీ ఆ నౌకను సొంతం చేసుకున్నారు. దీనికి 'ఆక్వా' అని నామకరణం కూడా చేశారు.

సాధారణంగా బిల్ గేట్స్ ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి సముద్ర విహారం చేయాలనుకుంటే ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ లను అద్దెకు తీసుకునేవారు. కానీ మొనాకోలో ఆక్వాను చూసీచూడడంతోనే కొనుగోలు చేశారు. ఈ నౌక పొడవు 370 అడుగులు కాగా, దీంట్లో ఒక మాస్టర్ డీలక్స్ సూట్, రెండు వీఐపీ సూట్లు, మరో నాలుగు గెస్ట్ క్యాబిన్లు ఉంటాయి. జిమ్, యోగా రూమ్, మేకప్ రూమ్, ఆన్ బోర్డ్ స్విమ్మింగ్ పూల్, మసాజ్ పార్లర్ ఏర్పాటు చేశారు.

14 మంది గెస్టులు ఉండేందుకు ఏర్పాట్లు చేయొచ్చు. ఆక్వాలో 31 మంది స్టాఫ్ ఉంటారు. దీంట్లోనే రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ విలాసవంతమైన యాచ్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇది మరో నాలుగేళ్లలో బిల్ గేట్స్ పరం కానుంది. ఆ ఐటీ దిగ్గజం అంత ఖర్చుపెట్టడానికి కారణం ఆ నౌక పర్యావరణానికి ఎలాంటి హాని చేయకపోవడమే.

ఆ యాచ్ట్ లిక్విడ్ హైడ్రోజన్ ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్ ను రెండు ట్యాంకుల్లో నిల్వచేస్తారు. ఒక్కో ట్యాంకులో 28 టన్నుల ఇంధనాన్ని నిల్వచేయొచ్చు. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఇంధనం నింపితే గంటకు 17 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 3,750 మైళ్లు ప్రయాణిస్తుంది.

More Telugu News