Mamillapalli Deepthi: ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన మాయలాడి దీప్తి.. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు!

  • సీఎంవోలో పనిచేస్తున్నట్టు పోజులు
  • విలాసవంతమైన జీవితానికి అలవాటు
  • లక్షలాది రూపాయలు వసూలు చేసి పరార్

ఉద్యోగాలిప్పిస్తానని లక్షలాది రూపాయలు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న మాయలాడి మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం  పెదకాకాని తరలించి కోర్టులో హాజరు పరచగా 11 రోజుల రిమాండ్ విధించారు. తెలుగుదేశం  ప్రభుత్వం ఉన్న సమయంలో  ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీకార్డు తయారుచేయించుకున్న దీప్తిది కాకుమాను మండలంలోని బోడిపాలెం.

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన దీప్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వలవేసింది. ఒకసారి వారు ఆమె ట్రాప్‌లో పడిన తర్వాత లక్షలాది రూపాయలు వసూలు చేసేది. ఈ క్రమంలో ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పించాలంటూ కడప జిల్లాకు చెందిన వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి.. దీప్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో రూ.12.50 లక్షలు చెల్లించాడు.

అలాగే, గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాటి దిలీప్, మోహనరావులు ఉద్యోగాల కోసం రూ. 6.50 లక్షలు సమర్పించుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో వారు గతేడాది అక్టోబరులో పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దీప్తి కోసం వేట ప్రారంభించిన పోలీసులు నిన్న హైదరాబాద్‌లో ఆమెను అరెస్ట్ చేశారు.

More Telugu News