India: జనవరి 15 తర్వాత చైనా వెళ్లిన విదేశీయులకు భారత్ లో ప్రవేశానికి అనుమతి నిరాకరణ

  • చైనాలో కరోనా వైరస్ విజృంభణ
  • నానాటికీ పెరుగుతున్న మృతుల సంఖ్య
  • చైనా నుంచి వచ్చేవారిపై భారత్ కఠిన ఆంక్షలు
  • ఇప్పటికే చైనాకు విమాన సర్వీసుల నిలిపివేత

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు చైనాను దాటి ఇతర దేశాల్లోనూ భయకంపితులను చేస్తోంది. చైనాలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైరస్ సోకిన బాధితుల సంఖ్య వేల సంఖ్యలో ఉండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. భారత్ లోనూ పలు కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్రం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, జనవరి 15 తర్వాత చైనా వెళ్లి, అక్కడి నుంచి భారత్ లో అడుగుపెట్టాలనుకునే విదేశీయులను అనుమతించబోమని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన అన్ని విమానయాన సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అనేక విమానయాన సంస్థలు ఇప్పటికే భారత్-చైనా మధ్య విమాన సర్వీసులను నిలిపివేశాయి. అటు, చైనా నుంచి మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సరిహద్దుల ద్వారా భారత్ లో ప్రవేశించే విదేశీయులకు అనుమతి నిరాకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

More Telugu News