జగన్ పాలన కక్ష, ప్రతీకారంతోనే సాగుతోంది : అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్

09-02-2020 Sun 12:59
  • నాపై తప్పుడు కేసులు పెట్టి 48 రోజులు జైల్లో ఉంచారు 
  • జైలు జీవితాన్ని సంతోషంగా గడిపాను 
  • వివేకానందరెడ్డి హత్య కేసులో డీజీపీ ఏం చేస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పై అమలాపురం మాజీ ఎంపీ, దళిత నాయకుడు హర్షకుమార్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రజాస్వామ్యానికి చెల్లు చీటీ ఇచ్చి జగన్ పాలన ఆసాంతం కక్ష, ప్రతికారేచ్చ ప్రాతిపదికగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు బనాయించి 48 రోజులపాటు జైల్లో ఉంచారని, అయితే జైలు కాలాన్ని తాను సంతోషంగా గడిపానని తెలిపారు.

రాజమండ్రిలో నిన్న జగన్ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, పోలీసులు తమ ఇంట్లో కార్యక్రమంలా జరిపించారని విమర్శించారు. జగన్ సభకు జనం లేకపోయినా వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదన్నారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.