Dymond Princes: జపాన్ నౌకలో చిక్కుకుని... ప్రాణభయంతో భారతీయుల విలవిల!

  • 'డైమండ్ ప్రిన్సెస్' నౌకలో 138 మంది మనవారు
  • కరోనా వైరస్ కారణంగా ప్రాదేశిక జలాల్లో నిలిపేసిన జపాన్ 
  • తమను రక్షించాలంటూ భారత ప్రభుత్వానికి వేడుకోలు

జపాన్ తీరంలో నిలిపివేసిన 'డైమండ్ ప్రిన్సెస్' నౌకలోని 138 మంది భారతీయులు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. నౌకలో మొత్తం 3,700 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా వీరిలో 63 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. హాంకాంగ్ కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు నౌకలో ఐదు రోజులపాటు ప్రయాణించి గతనెల 25న హాంకాంగ్ లో దిగిపోయాడు. కానీ అప్పటికే ఇతనికి కరోనా వైరస్ సోకి ఉందని ఆ తర్వాత పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఇతను నౌకలో లేకపోయినా ఇతని వల్లే ఇతర ప్రయాణికులకు వైరస్ సోకింది. దీంతో నౌకలోని వారిని తమ దేశంలోకి జపాన్ అనుమతించడం లేదు.

ప్రస్తుతం ఈ నౌక అక్కడి ప్రాదేశిక జలాల్లో నిలిపివేసి ఉంచగా తమ పరిస్థితి ఏమిటో అర్థంకాక నౌకలోని వారు ఆందోళన చెందుతున్నారు. వీరిలో 138 మంది భారతీయులు ఉండగా 132 మంది నౌక సిబ్బంది కావడం విశేషం. ఆరుగురే ప్రయాణికులు.

ఈ నౌకలో స్టీవార్డుగా పనిచేస్తున్న కర్ణాటక వాసి అభిషేక్ (26) నిన్న తల్లిదండ్రులకు ఓ వీడియో సందేశం పంపాడు. నౌకలో పనిచేస్తున్న వినయ్ కుమార్ సర్కార్ అనే మరోవ్యక్తి కూడా 1.46 నిమిషాల వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేసి తమను రక్షించాలని వేడుకున్నాడు.

కాగా, కొడుకు అభిషేక్ వీడియో చూసిన తండ్రి బాలకృష్ణన్ టోక్యోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో 'నౌకలోని భారతీయులందరి క్షేమం కోసం మేము జపాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. వారందరినీ క్షేమంగా బయటకు తీసుకువస్తాం' అంటూ టోక్యో ఎంబసీ అధికారి అనిల్ మెయిల్ పంపారు.

నౌకలో 63 మంది వైరస్ బారిన పడగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు. వైరస్ సోకిన వారిలో భారతీయులు ఎవరూ లేకపోయినా చైనా తర్వాత ఆ స్థాయిలో బాధితులు ఉన్నది నౌకలోనే కావడంతో జపాన్ ప్రభుత్వం వీరి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది.

మందులు, మాస్క్ లు అందుబాటులో ఉంచడమేకాక ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులతో సంప్రదించేందుకు వీలుగా అవసరమైన సమాచార ఏర్పాట్లు కూడా చేసింది. ప్రయాణికుల కోసం వివిధ చానళ్లు, వివిధ భాషల్లో సినిమాలను ప్రదర్శిస్తోంది.

More Telugu News