RTA: వెహికిల్ కు లక్కీ నంబర్ కావాలా?... తెలంగాణలో తొలిసారి ఆన్ లైన్ బిడ్డింగ్!

  • హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు
  • 10వ తేదీ సోమవారం నాడు వేలం
  • ఖరారైన విధివిధానాలు

వాహనాలకు ప్రత్యేక గుర్తింపు నంబర్లకు ఈ దఫా ఆన్ లైన్ లో బిడ్డింగ్ విధానాన్ని నిర్వహించాలకున్న తెలంగాణ రవాణా శాఖ అధికారులు, ఈ నెల 10వ తేదీ, సోమవారం నాడు ఐదు ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా బిడ్డింగ్ ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ టెండర్ల విధానంలో ప్రత్యేక సంఖ్యల అమ్మకాన్ని సాగిస్తుండగా, అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆన్ లైన్ లో వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే విధి విధానాలు కూడా ఖరారయ్యాయి.

ఇందులో భాగంగా, తమకు కావాల్సిన నంబర్ ను ఆర్టీయే వెబ్ సైట్ లో ఎంపిక చేసుకుని, నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలి. వాహనం టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలను, ఆధార్, పాన్ కార్డులు తదితర పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఆపై నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర ఆన్ లైన్ పద్ధతుల్లో ఆర్టీయే నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఆన్ లైన్ లో బిడ్డింగ్ జరుగుతుంది. సదరు నంబర్ ను కోరుకునే వ్యక్తి ఎంతయితే చెల్లించాలని భావిస్తారో, ఆ మొత్తాన్ని చెల్లిస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తారో, వారికి నంబర్ దక్కుతుంది. బిడ్డింగ్ లో పాల్గొని, కోరుకున్న నంబర్ ను దక్కించుకోలేక పోయిన వారికి 48 గంటల్లో డబ్బులు వెనక్కు అందుతాయి.

బిడ్డింగ్ సమాచారం మొత్తాన్నీ ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ల ద్వారా పంపుతామని అధికారులు వెల్లడించారు. కాగా, 9999 నంబర్ కు రూ. 10 లక్షలకు పైగానే ధర పలుకుతుందని అంచనా. ఖరీదైన కార్లు, హై ఎండ్ బైక్ లను కొనుగోలు చేసేవారు, తాము అదృష్ట సంఖ్యగా భావించే నంబర్ కోసం ఎంతైనా వెచ్చిస్తారన్న సంగతి తెలిసిందే. 9, 99, 999, 1234, 1, 2222, 7777, 786, 1111 తదితర నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ ఆర్టీయే కేంద్రాల్లో ఆన్ లైన్ బిడ్డింగ్ జరుగుతుందని, సందేహాలుంటే 040–23370081/83/84 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

More Telugu News