Venkaiah Naidu: చట్టసభల కార్యకలాపాలు చూసి నేటితరం ఏం నేర్చుకోవాలి?: వెంకయ్యనాయుడు ఆవేదన

  • చట్టసభల్లో నేతల తీరుపై వెంకయ్య అసహనం
  • పార్లమెంటులో నేతలు వాడుతున్న భాష సిగ్గుచేటని వ్యాఖ్యలు
  • అసెంబ్లీల్లోనూ అసభ్య పదజాలం కొనసాగుతోందని వెల్లడి

చట్టసభల్లో నేతల తీరుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని, పార్లమెంటులో నేతలు వాడుతున్న భాష సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఎదుటి పార్టీలో ఉన్నవాళ్లు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదన్న విషయాన్ని అందరు సభ్యులు గుర్తెరగాలని హితవు పలికారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు సైతం తిట్ల పురాణాలకు మినహాయింపు కాదని వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. శాసనసభల్లోనూ అసభ్య పదజాలం కొనసాగుతోందని అన్నారు.

చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని, కానీ ఇప్పటి చట్టసభల కార్యకలాపాలు చూసి నేటితరం ఏం నేర్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో చదువుతో పాటు వినయం, సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉందని, విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాలని అభిలషించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గురువులు బోధించాలని సూచించారు. అంతేకాదు, సీఏఏ సహా ఇతర చట్టాలను దేశ ప్రజలంతా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

More Telugu News