Chandrababu: సొంతంగా ఒక్క భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?: చంద్రబాబు విసుర్లు

  • వైసీపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు
  • ఒక్క కంపెనీ తీసుకురావడం చేతకాదంటూ వ్యాఖ్యలు
  • కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్ అంటూ వ్యంగ్యం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. "ఒక్క కంపెనీని తీసుకొచ్చే సమర్థత లేదు, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ విశాఖలో లక్షణంగా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు మీకెవరిచ్చారు?" అంటూ మండిపడ్డారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? అంటూ నిలదీశారు.

"సింగపూర్ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్ అన్నీ ఈ 8 నెలల్లో క్యూ కట్టాయి. అమరావతిలో సచివాలయం ఉండగా అది చాలదన్నట్టు విశాఖలో మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట! చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్. ఈ ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

More Telugu News