Hyderabad film chamber: అమరావతి రైతులకు సినీ పరిశ్రమ మద్దతు కోరుతూ హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ వద్ద విద్యార్థుల ఆందోళన!

  • విద్యార్థుల ఆందోళనకు సీపీఐ మద్దతు
  • ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు వినతిపత్రం సమర్పణ
  • రైతులకు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ

రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీపీఐ నేతలు వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో గత యాభై రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోందని, ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజల తరఫున నిలబడే బాధ్యతను కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు తీసుకోవాలని, అందుకే, సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. ఏపీలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

రాజధానిని తరలించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నామని చెప్పారు. సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తోంది కనుక తమ అండగా నిలబడమని కోరుతున్నామని అన్నారు.

More Telugu News