Amaravati: వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధిరావాలనే 151 గంటల నిరాహారదీక్ష: వెలగపూడిలో దీక్ష చేస్తున్న ఇద్దరు యువకులు

  • నాల్గో రోజుకు చేరిన యువకుల నిరాహార దీక్ష
  • ‘మూడు రాజధానులు’ ప్రపంచంలోనే ఎక్కడా లేవు 
  • రాజధాని పోరాటం ఒక సామాజిక వర్గం కోసమే అనడం తగదు

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ వెలగపూడిలో ఇద్దరు యువకులు చేపట్టిన 151 గంటల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇద్దరు యువకులు రవి, శ్రీకర్ ల నిరాహారదీక్ష నాల్గో రోజుకు చేరింది. ఇద్దరికీ స్థానిక వైద్య సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు.  

రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను ఇచ్చి త్యాగం చేశారని, ప్రభుత్వం వీరిని అవమానపరచడాన్ని తట్టుకోలేకపోతున్నామని దీక్ష కొనసాగిస్తున్న ఇద్దరు యువకులు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందికి బుద్ధి రావాలని, తమ గురించి ఆలోచిస్తారని కోరుకుంటూ ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కొక్క గంట చొప్పున కేటాయిస్తూ 151 గంటల నిరాహారదీక్షకు దిగామని చెప్పారు.

‘మూడు రాజధానులు’ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేని కాన్సెప్ట్ అని విమర్శించారు. రెండు రాజధానులు పెట్టుకోవాలని, అమరావతిని రాజధానిగా వద్దని, నాడు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే భూములను తమకు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమా? ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిశ్రమలు తరలిపోకుండా చూడటం ముఖ్యమా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం పోరాడుతోంది, ఒక సామాజిక వర్గం వారేనని విమర్శిస్తున్నారని, ఏ సామాజిక వర్గాన్ని అయితే విమర్శిస్తున్నారో ఆ సామాజిక వర్గం వారినందరినీ రెండు జిల్లాల్లో పడేసి, ఆ రెండు జిల్లాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఒక జీవో విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోపక్క, రాజధాని రైతుల ఆందోళన 53వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడంలో రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి.

More Telugu News