cuddapha: కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

  • సుదీర్ఘంగా 30 గంటలపాటు తనిఖీలు
  • పలు డాక్యుమెంట్లు, డబ్బు, బంగారం స్వాధీనం
  • ఇవి ఎప్పుడూ ఉండేవే : శ్రీనివాసులరెడ్డి తల్లి

కడప జిల్లా సీనియర్‌ నాయకుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారుల తనిఖీలు నిన్న మధ్యాహ్నానికి ముగిశాయి. కేంద్ర సాయుధ బలగాలతో గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో శ్రీనివాసులరెడ్డి ఇంటికి వచ్చిన అధికారులు దాదాపు 30 గంటలపాటు పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ అధికారులు ఆర్కే ఇన్‌ఫ్రా కంపెనీకి సంబంధించిన పలు డాక్యుమెంట్లు, బంగారం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

బీరువా, అల్మరాలు, లాకర్లు...ఇలా ఇంట్లోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు మూడు సంచుల్లో డబ్బు, దస్త్రాలను వాహనాల్లోకి ఎక్కించి తీసుకువెళ్లారు. కాగా, దాడుల సమయంలో ఇంట్లో ఉన్న శ్రీనివాసులరెడ్డి తల్లి హేమలత మాట్లాడుతూ ఇటువంటి తనిఖీలు తమకు కొత్తకాదని, ఎప్పుడూ ఉండేవేనని తేలికగా తీసుకున్నారు.

తొలిరోజు కాసేపు తనను ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత వారిపని వారు చూసుకున్నారని, ఏవేవో రాసుకున్నారని తెలిపారు. బీరువాలు, లాకర్ల తాళాలు అడిగి తీసుకుని కొంత డబ్బు, బంగారం, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తనను మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.

More Telugu News