Amaravati: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్.. మరో ఐదుగురిపై సీఐడీ కేసులు

  • ఇన్సైడర్ ట్రేడింగ్ లో విచారణను ముమ్మరం చేసిన సీఐడీ
  • అసైన్డ్ భూములు కొన్నవారి వివరాలు ఐటీ శాఖకు 
  • అక్రమ రేషన్ కార్డులను రద్దు చేయాలని కలెక్టర్ కు విన్నపం

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంలో సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిపై కేసులను నమోదు చేసిన సీఐడీ అధికారులు... తాజాగా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందిన వీరంతా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలపై సీఐడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

మరోవైపు అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఐటీ శాఖకు సీఐడీ అధికారులు మరోసారి పంపించారు. అసైన్డ్ భూములను కొన్నవారితో పాటు, రూ. 2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించినవారి వివరాలను కూడా అందజేశారు. అంతేకాకుండా, విలువైన ఆస్తులను కలిగి ఉండి, నిబంధనలకు విరుద్ధంగా తెల్ల రేషన్ కార్డులను పొందినవారి కార్డులను రద్దు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను సీఐడీ అధికారులు కోరారు.

More Telugu News