Pakistan: చిన్నారులపై హత్యాచార దోషులకు బహిరంగ ఉరి.. పాక్ పార్లమెంట్ తీర్మానం

  • హత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు పాక్ సంచలన నిర్ణయం
  • పార్లమెంటు తీర్మానంపై భిన్నాభిప్రాయాలు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన మానవ హక్కుల మంత్రి

పాకిస్థాన్ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడి, ఆపై హత్య చేసిన దోషులను బహిరంగంగా ఉరితీయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది. పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అలీ మహ్మద్ ఖాన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు ఆగాలంటే దోషులకు కేవలం ఉరిశిక్ష వేస్తే సరిపోదని, ఇలాంటి దారుణాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వారిని బహిరంగంగా ఉరితీయాల్సిందేనని పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం పాక్‌లోని నౌషెరా ప్రాంతంలో 8 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు తాజా బిల్లును తీసుకొచ్చారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి ఎంతమాత్రమూ సరికాదని, ఇది ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని అంటున్నారు. శిక్షలో తీవ్రత పెంచినంత మాత్రాన నేరాల సంఖ్య తగ్గదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత రాజా అష్రాఫ్ అన్నారు. పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పార్టీ నిర్ణయంలా ఉందే తప్ప ప్రభుత్వ నిర్ణయంలా లేదని మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి శిరీన్ బజారీ పేర్కొనడం గమనార్హం.

More Telugu News