Delhi: రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

  • రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
  • 70 నియోజకవర్గాల నుంచి 672 మంది అభ్యర్థుల పోటీ
  • 13,750 పోలింగ కేంద్రాల ఏర్పాటు

రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 13,750 పోలింగ కేంద్రాలను, మొత్తం 69 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది.

ఇక మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహించే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, అతి తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంగా పటేల్ నగర్ నిలిచింది. ఇక్కడి నుంచి కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.

మరోపక్క, ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ నెల 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపటి ఎన్నికల దృష్ట్యా ఉదయం నాలుగు గంటల నుంచే ఢిల్లీ మెట్రో రైల్ సేవలు ప్రారంభం కానున్నాయి.

More Telugu News