మేడారం జాతరలో సీఎం కేసీఆర్.. సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు

07-02-2020 Fri 14:52
  • సమ్మక్క, సారలమ్మలకు పట్టు వస్త్రాల సమర్పణ
  • నిలువెత్తు బంగారం సమర్పించుకున్న సీఎం
  • గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్రాసులో కూర్చుని నిలువెత్తు బంగారం(బెల్లం)ను సమర్పించారు.  

అశేష భక్తజన సమూహం వెంటరాగా సమ్మక్క నిన్న రాత్రి గద్దెపై కొలువు దీరింది. అప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. సమ్మక్క రాకతో గద్దెలపై వనదేవతలు ఆసీనమయ్యే కార్యక్రమం పూర్తయింది. అనంతరం గద్దెలపై కొలువుదీరిన ఈ నలుగురు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకోవడానికి భక్త జనం ముందుకు కదిలారు. దేవతలను దర్శించడానికి దేశం నలుమూలలనుంచి భక్తులు తరలి వస్తుండటంతో మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది.