Varla Ramaiah: వివేకా కేసుపై మీ పిటిషన్‌ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు?: జగన్ కు వర్ల రామయ్య సూటి ప్రశ్న

  • వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆనాడు జగన్ కోరారు
  • హైకోర్టులో వేసిన రిట్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో జగన్ చెప్పాలి
  • ఎవరిని రక్షించడం కోసం రిట్‌ను విత్‌ డ్రా చేసుకున్నారు?
  • ఏ మలుపులు తిరగబోతుంది ఈ కేసు?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యాజ్యాలపై నిన్న హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో జగన్ వేసిన వాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించి, తమ పిటిషన్‌ను మూసేయాలని కోరారు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.

ఈ రోజు మంగళగిరిలో మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ... 'వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆనాడు వైఎస్ జగన్ కోరారు. నిన్న కోర్టులో ఆ పిటిషన్‌ను జగన్‌ వెనక్కి తీసుకోవడం మాకు ఆశ్చర్యంగా ఉంది. హైకోర్టులో వేసిన రిట్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో జగన్ చెప్పాలి. దీని వెనుక ఆంతర్యం ఏంటీ? ఎవరిని రక్షించడం కోసం రిట్‌ను విత్‌ డ్రా చేసుకున్నారు? వివేకానంద కుటుంబ సభ్యుల భద్రతపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం' అని వ్యాఖ్యానించారు.

'ఏ మలుపులు తిరగబోతుంది ఈ కేసు? ఈ కేసులో ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి? అమాయకులని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. అటువంటి పరిస్థితుల్లో రిట్‌ను కూడా వెనక్కు తీసుకున్నారు' అని వర్ల రామయ్య అన్నారు.

'మీ బంధువులు ఈ విషయంపై మిమ్మల్ని అడగకపోవచ్చు. కానీ, ప్రతిపక్షంగా మేము అడగాలి కదా? ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో సమాధానం చెప్పాలి. ఒకవేళ సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తే మీ రహస్యాలు బయటపడతాయని భయపడుతున్నారా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

More Telugu News