Google: గూగుల్ మ్యాప్స్ కే బురిడీ... ట్రాఫిక్ జామ్ నే సృష్టించిన వ్యక్తి... వీడియో ఇదిగో!

  • సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లతో మోసం
  • ఫోన్లను ట్రాలీలో వేసుకుని నడుస్తూ వెళ్లిన వ్యక్తి
  • రహదారిలో ట్రాఫిక్ అధికమని భావించిన గూగుల్

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే... అందునా నగరాల్లో తొలుత గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్సే అనడంలో సందేహం లేదు. ఎక్కడ ట్రాఫిక్ అధికంగా ఉంది? ఏ రూట్ లో వెళితే గమ్యానికి త్వరగా చేరుకోవచ్చన్న విషయాలను గూగుల్ చూసి తెలుసుకునే వారి సంఖ్య ఇప్పుడు కోట్లల్లోనే ఉంది. అటువంటి గూగుల్ మ్యాప్స్ నే ఓ వ్యక్తి తప్పుడు ట్రాఫిక్ జామ్ ను సృష్టించి, బురిడీ కొట్టించాడు. ఈ ఘటన బెర్లిన్ లో జరిగింది. ఇక ఈ ఫేక్ ట్రాఫిక్ జామ్ ను ఎలా సృష్టించాడన్న వివరాల్లోకి వెళితే...

బెర్లిన్‌కు చెందిన సిమన్‌ వెకర్ట్‌ అనే వ్యక్తి, 99 సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లను కొనుగోలు చేశాడు. వాటన్నింటినీ ఓ చిన్నపాటి ప్లాస్టిక్ ట్రాలీలో వేసుకుని, రోడ్డుపై నడవడం ప్రారంభించాడు. ఆ ఫోన్లు అన్నీ ఆన్ లోనే ఉండటంతో, గూగుల్ కు విషయం మరోలా అర్థమైంది. ఆ వీధిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని భావించింది. దీంతో గూగుల్ మ్యాప్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఈ రహదారిని గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ కు మార్చివేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి అతి దగ్గరలోనే గూగుల్ సంస్థ ఉండటం గమనార్హం.

ఇక తన నిర్వాకాన్ని సిమన్‌ వెకర్ట్‌ వీడియో తీసి యూట్యూబ్‌ లో అప్‌ లోడ్‌ చేశాడు. తాను గూగుల్ మ్యాప్స్ ను తప్పుదారి పట్టించగలిగానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మొత్తం వ్యవహారం నిజమేనా? లేక బూటకమా? అన్న చర్చ జరుగుతోంది.

More Telugu News