TTD: టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు...శీఘ్ర దర్శనం పేరుతో లావాదేవీలు!

  • చెన్నై, పూణే, బెంగళూరు కేంద్రంగా నిర్వహణ 
  • మొత్తం 20 సైట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు 
  • తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో మోసాలకు అంతే ఉండడం లేదు. దేవస్థానం అధికారులు, విజిలెన్స్ సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక లొసుగు, మోసం బయటపడుతూనే వున్నాయి. తాజాగా ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్లు ఉన్నట్లు గుర్తించి అధికారులు నోరెళ్లబెడుతున్నారు. శీఘ్ర దర్శనం పేరుతో లావాదేవీలు నడుస్తున్నట్లు గుర్తించారు. చెన్నై, పూణే, బెంగళూరు కేంద్రంగా దాదాపు 20 నకిలీ వెబ్ సైట్లు నడుస్తున్నాయని గుర్తించిన అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానాల్లో తిరుమల ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కోట్లాది రూపాయలు విరాళంగా సమర్పించుకుంటారు. సాధారణంగా స్వామి వారి దర్శనానికి రోజు నుంచి రద్దీ సమయాల్లో మూడు రోజులు పట్టిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితే అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది.

స్వామి వారిని వేగంగా దర్శించుకోవాలి, గదులు, సదుపాయాలు దక్కించుకోవాలన్న భక్తుల ఆశను నకిలీ మార్గాల్లో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు, వీవీఐపీల పాస్ లు, లడ్డూలు...ఇలు పలు అంశాల్లో ఇప్పటికే మోసాలు వెలుగు చూడడం, ఇందులో కొందరు సిబ్బంది పాత్ర కూడా  ఉందని తేలడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా నకిలీ వెబ్ సైట్ల బండారం బయటపడింది.

More Telugu News