Mehak Kumari: మతం మారను.. అతనితో జీవించను: పాకిస్థాన్ లో అపహరణకు గురైన హిందూ బాలిక

  • 15 ఏళ్ల హిందూ బాలికను అపహరించి పెళ్లాడిన అలీ రజా
  • తీవ్ర ఆందోళనలు చేపట్టిన అక్కడి హిందువులు
  • తన తల్లిదండ్రుల వద్దకు పంపించేయాలని కోర్టును కోరిన బాధితురాలు

తనకు మతం మారాలనే ఆలోచనే లేదని పాకిస్థాన్ లోని 15 ఏళ్ల హిందూ మైనర్ బాలిక మేహక్ కుమారి స్థానిక కోర్టుకు తెలిపింది. తనను పెళ్లి చేసుకున్న ముస్లిం వ్యక్తి అలీ రజాతో నివసించాలని తాను కోరుకోవడం లేదని, ఇస్లాం మతాన్ని తాను స్వీకరించనని స్పష్టం చేసింది. తనను తన తల్లిదండ్రుల వద్దకు పంపించేయాలని... తాను హిందూ మతంలోనే కొనసాగుతానని చెప్పింది.

తాను ఇష్టపూర్వకంగానే ఇస్లాం మతాన్ని స్వీకరించానని, అలీ రజాను పెళ్లాడానంటూ మేహక్ కుమారి జనవరి 21న కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ అంశంపై ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ, పొరపాటున తాను అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చానంటూ జడ్జికి మేహాక్ కుమారి తెలిపిందని... ఆమె తాజా స్టేట్ మెంటును న్యాయమూర్తి రికార్డ్ చేశారని చెప్పారు.

జనవరి 15న మేహక్ కుమారిని సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ లో దుండగులు అపహరించారు. ఆ తర్వాత ఆమెను అలీ రజా బలవంతంగా మతాన్ని మార్పించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి హిందూ ప్రజలు రగిలిపోయారు. తీవ్ర ఆందోళనలు చేపట్టారు. వారికి కొన్ని ఉదారవాద ముస్లిం గ్రూపులు కూడా మద్దతు పలికాయి. ఈ కేసుకు సంబంధించి ఈరోజు స్థానిక కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

More Telugu News