Vizag: సీరియస్ అయిన బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్.. సర్దిచెప్పిన గౌతమ్ సవాంగ్!

  • విశాఖలో మాక్ డ్రిల్
  • సంయుక్త విన్యాసాలు చేసిన నేవీ, ఆర్మీ
  • ఆర్కే మీనాను హై కమిషనర్ వద్దకు పంపిన సవాంగ్

ఆయన బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్. ఓ అధికార కార్యక్రమం నిమిత్తం విశాఖపట్నం వచ్చి, ఓ హోటల్ లో బస చేశారు. దానిపై ఉగ్రదాడి జరిగింది. సముద్ర మార్గం ద్వారా దూసుకొచ్చిన ఉగ్రమూకలు, హోటల్ పై దాడికి దిగాయి. భారత సైన్య విభాగాల్లోని ఆక్టోపస్, మెరైన్ దళాలు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇదంతా... ఉగ్రదాడులు జరిగితే నావికాదళం స్పందించాల్సిన తీరుపై జరిగిన మాక్ డ్రిల్.

సైనికుల విన్యాసాలు, బాంబు చప్పుళ్లు, తుపాకి తూటాల చప్పుళ్లు ఎలా ఉన్నా, హోటల్ లో విశాఖ సముద్ర తీరాన ఉన్న సదరు హోటల్ లో బస చేసిన వాళ్లంతా హడలిపోయారు. ఉగ్రవాదుల దాడి నిజంగా జరుగుతూ ఉందేమోనని బెంబేలెత్తారు. చివరకు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ముందస్తు సమాచారం లేకుండా, విన్యాసాలు చేయడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఆండ్రూ ఫ్లెమింగ్ ఫిర్యాదు చేశారు. ఈ తరహా చర్యలు సరికాదని, కనీసం తమకైనా చెప్పుండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో గౌతమ్ సవాంగ్ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనాను ఫ్లెమింగ్ దగ్గరకు పంపించారు. ఫ్లెమింగ్ ను కలిసిన మీనా, పరిస్థితులను వివరించి, సముదాయించడంతో ఆయన శాంతించారు.

More Telugu News