Jagan: సీఎం అయ్యాక రెండో సారి కోర్టుకు... హైదరాబాద్ బయలుదేరుతున్న జగన్!

  • నేడు నాంపల్లి కోర్టులో విచారణ
  • 10.30 గంటలకు చేరుకోనున్న జగన్
  • విచారణ అనంతరం తిరిగి విజయవాడకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, నేడు రెండోసారి వైఎస్ జగన్, హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. తమపై నమోదైన సీబీఐ, ఈడీ అక్రమాస్తుల కేసులలో ప్రతి శుక్రవారం జగన్, విచారణకు హాజరు కావాల్సివుందన్న సంగతి తెలిసిందే. సీఎం అయిన తరువాత, ఇప్పటివరకూ జగన్ ఒక్కసారి మాత్రమే కోర్టుకు వచ్చారు. ఈ కేసులలో జగన్, విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, తాడేపల్లి నుంచి జగన్ హైదరాబాద్ కు బయలుదేరారు.

కాగా, సీబీఐ కేసులలో విచారణకు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. అయితే, ఈడీ కేసులలో హాజరు మినహాయింపు విషయంపై వేసిన పిటిషన్ ను జగన్ న్యాయవాదులు సాంకేతిక పొరపాట్లు దొర్లాయంటూ వెనక్కు తీసుకున్నారు. దీనిపై మళ్లీ ఇంతవరకు పిటిషన్ వేయలేదు. దీంతో ఈ రోజు ఈడీ కేసులో విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరు కావలసి వుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.  

ఈ క్రమంలో ఈ ఉదయం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన కోర్టుకు చేరుకుంటారని తెలుస్తోంది. జగన్ రాక సందర్భంగా ఇప్పటికే కోర్టు ఆవరణను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. విచారణ ముగియగానే, జగన్ తిరిగి విజయవాడకు వెళ్లిపోతారని తెలుస్తోంది. జగన్ తో పాటు , ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా నేడు కోర్టుకు హాజరు కానున్నారు.

More Telugu News