Hajipur: ఉరితీసిన తర్వాత అతడి శవాన్ని మాకు చూపించాలి... అదే మాకు పండుగ: శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలు

  • హాజీపూర్ కిరాతకుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష
  • వరుస హత్యల కేసులో ఫోక్సో న్యాయస్థానం తీర్పు
  • హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు

నల్గొండ జిల్లా హాజీపూర్ లో వెలుగుచూసిన వరుస హత్యలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి ఫోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దీనిపై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. మృతుల్లో ఒకరైన శ్రావణి తల్లి ఈ అంశంలో పోలీసులకు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ కిరాతకుడ్ని వారంలోపే ఉరితీయాలని, అప్పుడే తమ పిల్లల ఆత్మలకు శాంతి చేకూరుతుందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన తర్వాత అతడి శవాన్ని తమకు చూపించాలని, అప్పుడే తమకు మనశ్శాంతి అని పేర్కొన్నారు.

మరో మృతురాలు కల్పన తల్లి దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే తాము పది నెలలుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆ గ్రామానికే చెందిన కల్పన, శ్రావణి, మనీషాలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడి అంతమొందించాడు. కల్పన కేసులో అతడికి జీవితఖైదు విధించగా, మనీషా, శ్రావణి కేసుల్లో పోలీసులు తిరుగులేని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ఉరిశిక్ష పడింది.

More Telugu News