Undavalli: రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుంది?: అమరావతి అంశంలో ఉండవల్లి వ్యాఖ్యలు

  • రాజధాని రైతులపై స్పందించిన ఉండవల్లి
  • డబ్బులు వస్తాయన్న ఆశతో భూములు ఇచ్చారని వెల్లడి
  • త్యాగాలు చేస్తే ప్రతిఫలం ఆశించరు కదా అంటూ వ్యాఖ్యలు

ఏపీ పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అమరావతి రైతుల అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రైతులది త్యాగం కాదని, గత ప్రభుత్వం వెల్లడించిన రియల్ ఎస్టేట్ ప్రణాళికకు ఒప్పుకుని భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతి పెద్ద సిటీగా మారితే తమకు భారీగా డబ్బులొస్తాయనే భూములు ఇచ్చారని వివరించారు.  రైతులు త్యాగం చేశారని చంద్రబాబు అంటున్నారని, త్యాగం చేసినవాళ్లు డబ్బులు ఆశించకూడదు కదా? అంటూ తర్కం తీశారు.

లక్ష కోట్లు వెనకేసుకున్నాడని టీడీపీ అనేక ఆరోపణలు చేసినా ప్రజలు జగన్ వైపే మొగ్గుచూపారని అన్నారు. జగన్ రాజధాని అంశం కంటే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే శ్రద్ధ చూపించాలని హితవు పలికారు. ఏపీ రాజధాని ఎక్కడున్నా ఒకటేనని, కానీ రాష్ట్రానికి మూడు రాజధానులంటేనే ఏమీ చెప్పలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. శాసనసభ ఒక ప్రాంతంలో, సెక్రటేరియట్ మరో ప్రాంతంలో ఎక్కడా ఏర్పాటు కాలేదని, దేశంలో ఎక్కడా లేదని ఉండవల్లి అన్నారు. ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇలాంటి సందర్భం దేశంలో మరెక్కడా రాలేదని, అందుకే అమరావతిపై తీవ్రస్థాయిలో అనిశ్చితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, అందరి దృష్టి చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయన్న దానిపై పడిందని వివరించారు.

అసలు, చంద్రబాబు, జగన్ దృష్టిలో రాజధాని అంటే ఓ పెద్ద నగరం అని, పెద్ద నగరం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావించాడని, ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయంతో ముందుకు పోతున్నాడని ఆరోపించారు. ఏ కారణం వల్ల ఏపీ, తెలంగాణ విడిపోయాయో తెలిసి కూడా జగన్ అదే తప్పు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.

రాబోయే పదేళ్లలో ఎవరూ హైదరాబాద్, బెంగళూరు వెళ్లే అవసరంలేకుండా విశాఖను అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడని, దానర్థం హైదరాబాద్ తరహాలో అభివృద్ధి అంతటినీ ఒకే చోట కేంద్రీకరణ చేస్తున్నట్టేనని అన్నారు. ఈ అంశంలో పంజాబ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, అక్కడ పెద్ద నగరం అంటూ ఏమీ ఉండదని, అన్నీ ద్వితీయశ్రేణి నగరాలే కనిపిస్తాయని తెలిపారు. కానీ అక్కడి జనాభాలో 60 శాతం మంది ధనికులే ఉంటారని అన్నారు.

More Telugu News