Lok Sabha: లోక్ సభలో ‘కియా మోటార్స్’పై టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య వాగ్వాదం

  • కియా తరలిపోతోందన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
  • కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి
  • సంస్థ తరలిపోవడంలేదంటూ కియా ఎండీ స్పష్టం చేశారన్న మిథున్ రెడ్డి

ఏపీలోని కియా మోటార్స్ కంపెనీ తరలింపుపై వస్తోన్న వార్తలు లోక్ సభకు చేరాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కియా సంస్థ తరలిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తోంటే.. ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

గత ప్రభుత్వ పాలనలో పలు ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. విశాఖలో మిలీనియం టవర్స్ నిర్మించి వేలాది మందికి ఉపాధి కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కల్పించుకుని కియా తరలింపుపై రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఖండించారు. దీంతో ఇరు పార్టీల ఎంపీల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. కియా సంస్థ తరలిపోతోందని మీడియాలో వచ్చిన వార్తలను సంస్థ ఎండీ ఖండించారని మిథున్ రెడ్డి చెప్పారు. టీడీపీ సభ్యులు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News