కియా మోటార్స్ తరలిపోతోందనే వార్తపై విజయసాయిరెడ్డి స్పందన

06-02-2020 Thu 12:25
  • ఈ వార్తలో నిజం లేదు
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • కియాతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి

ఏపీ నుంచి కియా మోటార్స్ తమిళనాడుకు వెళ్లబోతోందంటూ రాయిటర్స్ ఇచ్చిన వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనికంతా వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మరోపక్క, ప్లాంటును తరలించే యోచన తమకు లేదని కియా సంస్థ స్వయంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్తలో నిజం లేదని... కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కియా మోటార్స్ తో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వరంలోని రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఏపీలో కియా మోటార్స్ మరింత ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.