మేడారం...ఎటుచూసినా భక్త జన సాగరం!

06-02-2020 Thu 12:23
  • సమ్మక్క-సారలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
  • తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రాక
  • జాతర ప్రాంతంలో ఎటు చూసినా జనసందోహమే

మేడారం భక్త జనసాగరాన్ని తలపిస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో మేడారం ప్రాంతంలో ఎటు చూసినా జన సందోహం దర్శనమిస్తోంది. రెండో రోజు భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

నిన్న అర్ధరాత్రి గద్దె వద్దకు సారమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకోగా, ఈరోజు సాయంత్రం సమ్మక్క చేరుకోనుంది. సమ్మక్క రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులంతా చిలకలగుట్టవద్దే వేచి ఉంటారు. సమ్మక్క పూజారులు గుట్ట నుంచి కుంకుమభరిణ తీసుకుని కిందకు వస్తున్నప్పుడు జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు.

తుపాకీ శబ్దమే సమ్మక్క రాకకు చిహ్నం. రోడ్డుకు ఇరువైపులా కొలువుదీరిన లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ తొలుత చలపయ్య చెట్టు వద్దకు పూజారులు చేరుకుంటారు. అక్కడ పూజల అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో నిండు జాతర మొదలైనట్టే. అమ్మవార్ల ఆశీస్సులు పొందిన తర్వాత భక్తులు వెనుదిరుగుతారు.