హాలీవుడ్‌ లెజండరీ హీరో నటుడు కిర్క్‌ డగ్లస్‌ ఇకలేరు!

06-02-2020 Thu 10:24
  • 103 ఏళ్ల వయసులో కన్నుమూత
  • 90కి పైగా చిత్రాల్లో నటించిన కిర్క్ డగ్లస్
  • సంతాపం తెలిపిన హాలీవుడ్ పెద్దలు

తన అసమాన ప్రతిభతో కొన్ని దశాబ్దాల పాటు హాలీవుడ్ ను శాసించిన లెజండరీ హీరో కిర్క్‌ డగ్లస్‌ కన్నుమూశారు. ఆయన వయసు 103 సంవత్సరాలు. ఆయన నిండైన జీవితాన్ని అనుభవించారని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, ఆయన తమను విడిచిపెట్టి వెళ్లినట్లు ప్రకటించవలసి రావడం విచారకరమని కిర్క్ డగ్లస్ కుమారుడు, నటుడు మైఖేల్ డగ్లస్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

"మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నా" అంటూ తన తండ్రికి మైఖేల్‌ డగ్లస్ నివాళులు అర్పించారు. కిర్క్ తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలని పలువురు హాలీవుడ్ పెద్దలు సంతాపాలు తెలిపారు.

కాగా, 1916లో అమ్‌ స్టర్‌డామ్‌ లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన కిర్క్‌ డగ్లస్‌, బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. డైనా డిల్‌ తో వివాహం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. పెళ్లి తరువాత నటనను మొదలు పెట్టిన కిర్క్, తొలుత థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. ఆపై వెనుతిరిగి చూడలేదు. ఏడు దశాబ్దాల పాటు నటనను కొనసాగించి, 90 కి పైగా చిత్రాల్లో నటించి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా, రచయితగానూ నిరూపించుకున్నారు. హాలీవుడ్ స్వర్ణయుగపు స్టార్ హీరోగా ఆయన పేరుతెచ్చుకున్నారు.

క్లాసిక్ అనదగ్గ 'స్పార్టకస్', 'ది వైకింగ్స్' వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కిర్క్ కు పేరు తెచ్చి పెట్టాయి. వీటితో పాటు 'యాస్‌ ఇన్‌ ద హోల్‌', 'డిటెక్టివ్‌ స్టోరీ', 'లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌', 'సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే', 'స్నో రివర్‌', 'ద ఫ్యూరీ', 'గ్రీడీ', 'ఏ సెంచరీ ఆఫ్‌ సినిమా', 'డైమండ్స్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించారు.