Donald Trump: గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్... అభిశంసనను తిరస్కరించిన సెనేట్

  • ఇటీవల అభిశంసన తీర్మానానికి దిగువ సభ ఆమోదం
  • సెనేట్ లో అనుకూలంగా ఒకే రిపబ్లికన్ ఓటు
  • ట్రంప్ నిర్దోషిగా నిరూపించబడ్డారన్న వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు సెనేట్‌ లో భారీ ఊరట లభించింది. అధ్యక్షుడిగా ఆయన ఉండేందుకు తగడంటూ, దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనేట్‌ గురువారం నాడు తిరస్కరించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అభిశంసన తీర్మానం సెనేట్‌ లో వీగిపోయిందని, డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నేటితో ముగిసినట్టేనని, గతంలో తాము చెప్పినట్లుగానే ట్రంప్‌ నిర్దోషిగా తేలారని వెల్లడించింది. నిరాధారమైన అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా సెనేట్‌ ఓటు వేసిందని, అధ్యక్ష బరిలో నిలవాలని ఆశించి భంగపడిన ఓ రిపబ్లికన్‌ మాత్రమే అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారని తెలిపింది.

కాగా, అధ్యక్ష హోదాలో ఉండి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల నేత జో బైడన్‌ నుంచి ట్రంప్‌ కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో, బైడన్‌ ను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌ సహకారాన్ని ట్రంప్ తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ప్రతినిధుల సభ దానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు సెనేట్ దాన్ని తిరస్కరించింది.

More Telugu News