తల్లిని చంపి ప్రియుడితో పోర్ట్‌బ్లెయిర్ కు పరార్.. ఇద్దరినీ కటకటాలవెనక్కి పంపిన పోలీసులు

06-02-2020 Thu 10:09
  • రూ.15 లక్షల బాకీ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ
  • ఆవేశం పట్టలేక చాకుతో తల్లిని పొడిచి చంపిన కుమార్తె
  • బెంగళూరులోని కేఆర్‌పురంలో ఆదివారం ఘటన

తల్లిని చాకుతో పొడిచి చంపి, ప్రియుడితో పరారైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమృతను పోర్ట్‌బ్లెయిర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కేఆర్‌పురం పోలీసుల కథనం ప్రకారం..  ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల (55), తన కుమారుడు, కుమార్తె అమృతతో కలిసి అక్షయ నగర్‌లో నివసిస్తోంది. రూ.15 లక్షల బాకీ చెల్లించే విషయమై తల్లీకూతుళ్ల మధ్య ఆదివారం గొడవ జరిగింది. దీంతో ఆవేశం పట్టలేని అమృత చాకుతో తల్లిని దారుణంగా పొడిచి హత్య చేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పరారైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృత కోసం గాలింపు మొదలుపెట్టారు. వారి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిద్దరూ పరారవుతున్నట్టు గుర్తించామన్నారు. దర్యాప్తులో వారు  అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌లో తలదాచుకున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన కేఆర్‌పురం ఇన్‌స్పెక్టర్ అంబరీశ్ బృందం అమృతతోపాటు ఆమె ప్రియుడు శ్రీధర్‌రావును అరెస్ట్ చేసింది.