బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని కిడ్నాప్ చేసి.. తాళి కట్టిన యువకుడు!

06-02-2020 Thu 07:08
  • పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిగా వేధిస్తున్న యువకుడు
  • నిరాకరించడంతో కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి
  • మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యాయత్నం

బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని కిడ్నాప్ చేసి తాళి కట్టాడో యువకుడు. కర్ణాటకలోకి హసన్ జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలు (23) బస్‌స్టాప్‌లో ఎదురుచూస్తున్న సమయంలో కొందరు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు. అనంతరం యువతికి బావ వరుస అయ్యే మను (30) అనే యువకుడు ఆమె మెడలో తాళి కట్టాడు.

తనతో వివాహానికి ఆమె నిరాకరించిందన్న కోపంతో యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తనను వదిలేయాలని ఆమె బతిమాలినప్పటికీ అతడు వినిపించుకోకుండా కారులోనే ఆమె మెడలో తాళి కట్టి, అనంతరం తన స్నేహితుడి వద్ద ఆమెను దాచిపెట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వారి చెర నుంచి కాపాడారు.

పెళ్లి చేసుకోవాలంటూ మను ఏడాదిగా ఆమె వెంట పడుతున్నాడు. అయితే, ఆమె మాత్రం తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు. మంగళవారం రాత్రి బాధితురాలు హసన్ డెయిరీ సర్కిల్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. వినయ్, ప్రవీణ్‌, మరో స్నేహితుడితో కలిసి కారులో అక్కడికి చేరుకున్న మను బాధితురాలిని కిడ్నాప్ చేసినట్టు హసన్ ఎస్పీ రామ్ నివాస్ సేపట్ తెలిపారు.

బాధితురాలిని రక్షించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన బాధితురాలి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడని, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్పీ తెలిపారు.