ఇలాంటి సమయంలో రాజధాని తరలింపు అర్థంలేని నిర్ణయం: గల్లా జయదేవ్

05-02-2020 Wed 22:05
  • లోక్ సభలో అమరావతి అంశంపై గల్లా ప్రసంగం
  • సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీలు
  • రాష్ట్రంలో పరిస్థితి బాగా లేకుంటే దేశంలో పరిస్థితిపై ఏం మాట్లాడతామన్న గల్లా
  • 22 మంది ఎంపీలు ఉండి హోదా కోసం ఏంచేశారని నిలదీసిన రామ్మోహన్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ లోక్ సభలో అమరావతి అంశంపై మాట్లాడారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సమయంలో అమరావతిపై ప్రసంగించి స్పీకర్ అభ్యంతరాలను చవిచూశారు. సభా సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేనప్పుడు దేశంలో పరిస్థితులపై ఏమని మాట్లాడతామని, అందుకే అమరావతి గురించి ప్రసంగించానని చెప్పారు.

అమరావతిలో నిర్మాణాలు జరిగి పాలనకు సిద్ధమవుతున్న తరుణంలో రాజధాని తరలింపు నిర్ణయం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కారణంగా వేల కోట్ల పెట్టుబడులు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, వైసీపీ నుంచి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడడంలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.