'హ్యాండ్ సమ్' ఎన్నికల ప్రచారం.. ఆప్ అభ్యర్థికి సరికొత్త అనుభవం!

05-02-2020 Wed 21:00
  • ఢిల్లీలో రాజేంద్ర నగర్ అభ్యర్థి రాఘవ్ చద్దా
  • సోషల్ మీడియాలో రాఘవ్ ఎన్నికల ప్రచార వీడియోలు
  • పెళ్లి చేసుకోమంటున్న మహిళా ఫాలోవర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. ముఖ్యంగా, రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున బరిలోకి దిగిన ముప్పై ఒక్క ఏళ్ల అందగాడైన రాఘవ్ చద్దా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో తనకు, తమ పార్టీకి ఓట్టు వేయమని కోరుతున్న అతనికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు వస్తున్నాయి.

రాఘవ్ చద్దా ఎన్నికల ర్యాలీలు, ప్రచారాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో అప్ డేట్ చేస్తుంటారు. ఈ వీడియోలను వీక్షించే నెటిజన్లు, ఆయన అభిమానులు, ముఖ్యంగా మహిళా ఫాలోవర్లు చేసే ఆసక్తికర వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమను పెళ్లి చేసుకోవాలని కొంత మంది అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది మహిళలు అయితే తమకు కనుక కూతురు ఉంటే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తామంటూ రాఘవ్ చద్దాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయాలను రాఘవ్ చద్దా సోషల్ మీడియా బాధ్యతలు చూసే వ్యక్తి ఓ వార్తా సంస్థకు తెలిపారు.