జీవీఎల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా

05-02-2020 Wed 20:53
  • రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న జీవీఎల్
  • సాంకేతికంగా జీవీఎల్ వ్యాఖ్యలు సరైనవే అన్న శార్దా
  • కానీ, కోట్లాది రూపాయలు  వృథా అవుతుంటే చూస్తుంటారా? అని ఆగ్రహం
  • మూడు రాజధానుల నిర్ణయం దారుణమని వెల్లడి

ఏపీ రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యల పట్ల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవీఎల్ వ్యాఖ్యలు సాంకేతికంగా సరైనవే అయ్యుండొచ్చని, కానీ వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతుంటే చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్తుతో సీఎం జగన్ ఆడుకుంటుంటే మౌనంగా ఉంటారా? అంటూ ట్విట్టర్ లో నిలదీశారు.

"రాజ్యాంగపరంగా చూస్తే జీవీఎల్ వ్యాఖ్యలు సబబే కావచ్చు. కానీ కేంద్రం ఏపీకి ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులు వృథా అవుతుంటే ఏపీ బీజేపీ చూస్తూ అంగీకరిస్తుందా?" అంటూ రతన్ శార్దా ట్వీట్ చేశారు. అంతేకాదు, సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దారుణమైన నిర్ణయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ పరిస్థితిపైనా వ్యాఖ్యానించారు. వనరుల దుర్వినియోగంపై పోరాడే పార్టీగా, మతమార్పిళ్లకు వ్యతిరేకంగా నిలిచే పార్టీగా ఏపీలోనూ బీజేపీ తనదైన ముద్రవేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమిత్ షా, జేపీ నడ్డా, సునీల్ దేవధర్ ఏపీ బీజేపీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నానని, అందుకు ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు.