ఈ లేఖలో రాజధాని ప్రస్తావన ఉంది కాబట్టి తెలుగుదేశం అనుకూల మీడియా దీన్ని ప్రస్తావించదు: ఐవైఆర్ కృష్ణారావు

05-02-2020 Wed 19:07
  • సీఎం జగన్ కు లేఖ రాసిన ఐవైఆర్
  • విశాఖను రాజధానిగా స్వాగతిస్తున్నట్టు వెల్లడి
  • జగన్ పాలన పట్ల హిందువుల్లో అపోహలు ఉన్నాయని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై హిందువుల్లో కొన్ని అపోహలు నెలకొన్నాయంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు సీఎం జగన్ కు లేఖ రాశారు. చంద్రబాబు పాలన తరహాలోనే మీ పాలన కూడా సాగుతోందని హిందూ సమాజంలో ఓ భావన నెలకొందని, ఒకవేళ మీకు తెలియకుండా ఏవైనా సంఘటనలు జరిగివుంటే వాటికి తగిన నివారణ చర్యలు తీసుకుంటారనే ఈ లేఖ రాస్తున్నానని ఐవైఆర్ తెలిపారు. చాలా దేవాలయాల్లో అన్యమతస్తులు కీలకమైన ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారని, అలాంటివారి కారణంగా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, దీనిపై సీఎం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ ప్రణాళికలో ఇమామ్ లకు, పాస్టర్లకు ఆర్థిక సాయం చేసే చర్యలున్నాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిలిపివేయాల్సిన మీరు అమలు చేసే విధంగా వ్యవహరించారంటూ సీఎం జగన్ ను తప్పుబట్టారు. జెరూసలెం యాత్రలకు ఆర్థికసాయం పెంపు, చర్చిల నిర్మాణానికి మైనారిటీ కార్పొరేషన్ నుంచి సాయం అందించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేశారని, ఇలాటి చర్యలు గత ప్రభుత్వ హయాం నుంచే జరుగుతున్నా, ఇప్పుడు వాటిపై తాము న్యాయపోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా, పిఠాపురంలో హిందూ దేవతా విగ్రహాలను అగౌరవపరిచారని, ఒక్క పాకిస్థాన్ దేశంలో తప్ప ఇలాంటి చర్యలను ఎక్కడా చూడలేదని, మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు.

అంతేకాకుండా, ఐవైఆర్ తన లేఖలో రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అమరావతిని ఓ ఊహాజనిత నగరంగానే పేర్కొన్న ఆయన, ఆచరణలో అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబు గారికి కొన్ని వ్యవస్థలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల రాజధాని తరలింపు ప్రక్రియకు అవరోధాలు ఎదురైనా అధిగమిస్తారని ఆశిస్తున్నట్టు సీఎం జగన్ కు రాసిన తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక, తన లేఖలో రాజధాని అంశాన్ని ప్రస్తావించాను కాబట్టి దీనిగురించి తెలుగుదేశం అనుకూల మీడియా దీన్ని ప్రస్తావించదని, జగన్ పాలనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాను కాబట్టి సాక్షి కూడా ఈ లేఖను ప్రచురించదని ఐవైఆర్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. అందుకే దీంట్లోని అన్ని విషయాలు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా లేఖను బహిర్గతం చేస్తున్నానని వివరించారు.