జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ భూములపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి: సీపీఐ నారాయణ డిమాండ్

05-02-2020 Wed 18:43
  • విశాఖలోని మిథిలాపుర కాలనీలో నారాయణ పర్యటన
  • ఇప్పుడు లేని ‘మేటాస్’ కంపెనీ పేరిట భూములు ఉన్నాయి
  • మరో కంపెనీ పేరిట పదకొండు వందల ఎకరాలు 

విశాఖపట్టణంలో భూ అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ, మధురవాడలోని మిథిలాపుర కాలనీలోని ఏడు ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని ఇవాళ ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల పేరిట ఇక్కడి భూములను తీసుకుంటున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఎస్సీలు, బీసీలు, అసైన్ మెంట్స్ ల్యాండ్స్ ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ భూములను తీసుకుంటున్నారని విమర్శించారు. నాడు ఏర్పాటు చేసిన ‘మేటాస్’ కంపెనీయే మాయమైపోయిందని, ఆ కంపెనీ పేరిట యాభై ఎకరాల భూములు ఉన్నాయని, మరో కంపెనీ పేరిట పదకొండు వందల ఎకరాల భూమి ఉందని, ఆ కంపెనీ కూడా కనబడటం లేదని అన్నారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చుగా? అని ప్రశ్నించారు.

ఆ విధంగా తొమ్మిది ప్రాంతాల్లో రెండు వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు నిర్మిస్తే తాము సంతోషిస్తామని, జగన్మోహన్ రెడ్డికి పూల మాల వేస్తామని అన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా, పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. జగన్ కు చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ భూములపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.