కరోనా వైరస్ లక్షణాలతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు వ్యక్తులు

05-02-2020 Wed 16:18
  • రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
  • సాయంత్రానికి రానున్న పరీక్షల ఫలితాలు
  • నిన్న కూడా గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ భారత్ లో భయాందోళనలను పెంచుతోంది. ఇప్పటికే కేరళలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. హైదరాబాదులో కూడా ఈ వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో ఈరోజు మరో నలుగురు చేరారు. వీరి నుంచి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వైరాలజీ ల్యాబ్ లో కరోనా, స్వైన్ ఫ్లూ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి వీరికి సంబంధించిన ఫలితాలు రానున్నాయి. నిన్న కూడా నలుగురు వ్యక్తులు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉందని తేలింది. వీరిని స్వైన్ ఫ్లూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.