ఎమ్మెల్యే ఆర్కే బంధుగణాన్ని రైతులుగా చెప్పడమేంటి?: వర్ల రామయ్య

05-02-2020 Wed 15:37
  • సీఎంని రైతులు కలిశారన్న మాటలు అబద్ధం
  • ప్రభుత్వ నిర్లక్ష్యానికి 42 మంది రైతులు చనిపోయారు
  • వైసీపీ నేతలు కౌంటర్ ఉద్యమం చేయడం ఎంత వరకు సబబు?

నవ్యాంధ్రలో యాభై రోజుల పాటు ప్రజలు ఆందోళన చేయడం ఇదే తొలిసారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 42 మంది రైతులు చనిపోయారని ఆరోపించారు.

ఇక రాజధాని రైతులు సీఎంని కలిశారని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు అబద్ధాలని అన్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) బంధుగణాన్ని రైతులుగా చెప్పడమేంటి? ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ చేస్తున్న ఉద్యమానికి కౌంటర్ ఉద్యమాన్ని వైసీపీ నేతలు చేయడం ఎంతవరకు సబబు? అని రామయ్య ప్రశ్నించారు.