చరణ్ కోసం కథ రెడీ చేస్తున్న 'సాహో' దర్శకుడు

05-02-2020 Wed 14:19
  • 'రన్ రాజా రన్'తో దక్కిన విజయం 
  • పరాజయాన్ని తెచ్చిపెట్టిన 'సాహో'
  • చరణ్ తో సినిమాకి ప్రయత్నాలు 

'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన సుజీత్, ఆ తరువాత ప్రభాస్ తో 'సాహో' సినిమాను తెరకెక్కించాడు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే పెద్ద సాహసమే చేశాడనే ప్రశంసలు దక్కాయిగానీ, అభిమానులను మాత్రం ఈ సినిమా నిరాశ పరిచింది.

దాంతో సుజీత్ తదుపరి సినిమాను ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఆయన చరణ్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. చరణ్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. రేపో మాపో ఆ కథను చరణ్ కి వినిపించనున్నాడని అంటున్నారు. చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే గానీ, నిర్మాతలు సిద్ధంగానే వున్నారని సన్నిహితులతో సుజీత్ అంటున్నట్టుగా సమాచారం.