Arvind Kejriwal: అమిత్ షాకు సవాల్ విసిరిన కేజ్రీవాల్

  • నాతో బహిరంగ చర్చకు రండి
  • ప్రజల సమక్షంలో శనివారం చర్చలో పాల్గొందాం
  • మీకు ఓటు ఎందుకు వేయాలో ఢిల్లీ తెలుసుకోవాలనుకుంటోంది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ ఈ మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఆప్ అధినేత కేజ్రీవాల్ నిన్న డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. తాను ఇచ్చిన సమయం అయిపోవడంతో కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చారు. వారి సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని కూడా అమిత్ షా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనతో బహిరంగ చర్చకు రావాలంటూ అమిత్ షాకు సవాల్ విసిరారు.

బహిరంగ చర్చ అనేది ఎప్పుడూ మంచిదేనని... వచ్చి తనతో చర్చలో పాల్గొనాలని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజల సమక్షంలో శనివారం చర్చ జరుపుదామని చెప్పారు. మాకు ఓటు వేయండి, మీకు ముఖ్యమంత్రిని ఇస్తామని అమిత్ షా చెబుతున్నారని... అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని ఢిల్లీ తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు. షహీన్ బాగ్ రోడ్డును ఎందుకు తెరవలేదనే విషయాన్ని అమిత్ షా నుంచి ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు.

ఎందుకు ఇంత నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ కుమారుడినైన తాను టెర్రరిస్టును ఎలా అయ్యానని ప్రశ్నించారు. మనోజ్ తివారి, స్మృతి ఇరానీ, హర్దీప్ పూరి, విజయ్ వీరిలో ఎవరు మీ సీఎం అభ్యర్థి అని ఎద్దేవా చేశారు.

More Telugu News