Alla Ramakrishna Reddy: నమ్మశక్యం కాని రీతిలో సీఎం జగన్ వేగంగా స్పందించారు: ఎమ్మెల్యే ఆర్కే

  • సీఎం జగన్ ను కలిసిన రైతులు
  • రైతులతో పాటు సీఎం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆర్కే, శ్రీదేవి
  • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్కే
  • రైతులకు మేలు జరిగేలా వెంటనే ఆదేశాలిచ్చారని వెల్లడి

అమరావతి రైతులు ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రైతులు జగన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ, రాజధాని భూముల సేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించాలని సీఎం జగన్ వెంటనే ఆదేశించారని, మరో సీఎం అయితే ఇంత త్వరగా నిర్ణయం తీసుకునేవాళ్లు కాదేమోనని అన్నారు.

అక్విజిషన్ ఎత్తివేస్తే రైతుల పొలాలకు వెంటనే నీళ్లు వచ్చి, వారు వ్యవసాయ పనులు ప్రారంభించే వీలుంటుందని సీఎం జగన్ ఆలోచించారని తెలిపారు. నమ్మశక్యం కాని రీతిలో జగన్ రైతుల పక్షాన వేగంగా స్పందించారని కొనియాడారు. ఇంకెవరైనా అయితే రేపో, మాపో అని వాయిదా వేసేవారని అభిప్రాయపడ్డారు. రిజర్వ్ జోన్లను కూడా ఎత్తివేసేందుకు సీఎం హామీ ఇచ్చారని ఆర్కే తెలిపారు. రైతులకు పంటలు పండించుకునే హక్కు ఉంటుందని సీఎం చెప్పారని వివరించారు. అప్పట్లో తమ నుంచి బలవంతంగా భూసేకరణ చేశారని రైతులు సీఎంకు ఫిర్యాదు చేశారని అన్నారు. 

More Telugu News