AP Capital: కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై.. ఏపీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

  • రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఎలా తరలిస్తారన్న కోర్టు
  • ఈ నెల 26వరకు స్టేటస్ కో ఇస్తాం
  • మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ

వైసీపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా కర్నూలుకు కొన్ని కార్యాలయాలు తరలించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉండగా, కార్యాలయాలను ఎలా తరలిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 26వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈరోజు విచారణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కోర్టు ఆక్షేపించింది.

ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వాదనలను వినిపించారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలు ఎందుకు తరలిస్తున్నారని, స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేయవచ్చు కదా? అంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానమిస్తూ.. నిర్వహణకు అనువుగా లేకపోవడంవల్లే కార్యాలయాలను తరలిస్తున్నామని వివరించారు.

కాగా, ఈ పిటిషన్లపై మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు ఆయన తెలిపారు. అనంతరం న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై వేసిన పిటిషన్ పై కూడా విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

More Telugu News